రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని, దర్యాప్తు సాగిస్తోన్నారు.
ఇక చంద్రబాబును ములాఖత్ అయ్యే ప్రముఖుల లిస్ట్ పెరుగుతోంది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. భార్య భువనేశ్వరి, కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి.. చంద్రబాబును కలుసుకున్నారు. ఈ ములాఖత్ సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనాన్ని అందించారు.
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ, ఆయన అల్లుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సైతం చంద్రబాబును కలుసుకోనున్నారు.
దీనికోసం రేపు ఉదయం 10 నుంచి 10:30 గంటల మధ్యలో వారు రాజమండ్రికి రానున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ కరకట్ట ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ సెట్స్‌పై ఉన్నారు. హైదరాబాద్‌లో ఉంటోన్నారు. బాలకృష్ణ కూడా హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం.
వారంతా మళ్లీ వేర్వేరుగా రేపు రాజమండ్రికి రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జైలు దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు అధికారులు. కాగా.. పవన్ కల్యాణ్ ములాఖత్‌కు సంబంధించి ఇప్పటివరకు తమకు ఎటువంటి దరఖాస్తులు రాలేదని జైలు సూపరిండెండెంట్ పేర్కొన్నారు.