అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని, దర్యాప్తు సాగిస్తోన్నారు.
అదే సమయంలో బెయిల్ కోసం చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు. క్వాష్ పిటీషన్‌ను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఇక తాజాగా పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్లు వద్ద జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తోన్నారు చంద్రబాబు. ఈ ఘటనలో చంద్రబాబును ఏ1గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆయన దగ్గరుండి తన పార్టీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టడం వల్లే అంగళ్లు వద్ద పెద్ద ఎత్తున అల్లర్లు సంభవించాయని, పలువురు పోలీసులు గాయపడ్డారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది నేడు విచారణకు రానుంది.
చంద్రబాబు అరెస్ట్ కావడం, రాజమండ్రి జైలులో జ్యుడీషియల్ కస్టడీని ఎదుర్కొంటోండటంపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. జరిగిన విషయాలేవీ తనకు తెలియవని అంటూనే చంద్రబాబును కటకటాల వెనక్కి నెట్టడం పట్ల ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వంతో స్పందిస్తోన్నానని పేర్కొన్నారు.
73 సంవత్సరాలు అంటే జైల్లో గడపాల్సిన వయస్సు కాదని పూనమ్ కౌర్ అన్నారు. ప్రత్యేకించి- సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉంటూ సేవలు అందించిన అనంతరం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ ఇలా జైలుకు వెళ్లాల్సి రావడం బాధాకరమని చెప్పారు. జరుగుతున్న విషయాలపై తనకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ- మానవత్వంతో స్పందిస్తున్నానని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.